- మోడల్స్ లోని ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సార్ ని తిరిగి అమర్చేందుకు రీకాల్ చేసిన బ్రాండ్
- ప్రస్తుతం నిసాన్ నుంచి అందించబడుతున్న ఏకైక మోడల్ మాగ్నైట్
నిసాన్ బ్రాండ్ ఇండియాలో మాగ్నైట్ సబ్-4-మీటర్ ఎస్‍యూవీని స్వచ్చందంగా రీకాల్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా మాగ్నైట్ కార్లను రీకాల్ చేయడానికి కారణాన్ని కూడా తెలిపింది. అది ఏంటి అంటే, “మాగ్నైట్ మోడల్స్ లోని ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సార్ ని తిరిగి అమర్చేందుకే” అని ఆటోమేకర్ పేర్కొంది.
నిసాన్ ఇండియా ప్రకారం, నవంబర్ 2020 మరియు డిసెంబర్ 2023 మధ్య ఉత్పత్తి చేయబడిన అన్ని మాగ్నైట్ యూనిట్లు, పరిమిత సంఖ్యలో వచ్చిన ఎంట్రీ-లెవెల్ XE మరియు XL వేరియంట్లు, ఈ సమస్యను ఎదుర్కొంటున్న కార్లను రీకాల్ చేసింది. ప్రస్తుతం, నిసాన్ కంపెనీ ఈ నెలలో అనగా ఏప్రిల్ నెలలో ఆయా కార్లలో సమస్యను ఎదుర్కొంటున్న కస్టమర్ల వివరాలను సేకరించే పనిలో బిజీ అయిపోయింది.
ఈ రీకాల్ ద్వారా కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగానే వారి కార్లను రోజూ నడుపుతున్న విధంగానే నడపవచ్చని నిసాన్ తెలిపింది. డోర్ హ్యండిల్స్ వద్ద ఈ కొత్త సెన్సార్ ని ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అమర్చుతున్నట్లు నిసాన్ ఇండియా పేర్కొంది. కస్టమర్లు రీకాల్ కి సంబంధించి పూర్తి వివరాలను దగ్గరలో ఉన్న నిసాన్ సర్వీస్ సెంటరుకు వెళ్లి తెలుసుకోగలరు.
మాగ్నైట్ గురించి ఇంకా చెప్పాలంటే, నిసాన్ మాగ్నైట్ XE, XL, XV, మరియు XVప్రీమియం అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మారుతి బ్రెజా మరియు టాటా నెక్సాన్ తో పోటీపడుతున్న ఈ మోడల్ 5 మోనోటోన్ మరియు 4 డ్యూయల్ టోన్ కలర్లలో అందించబడుతుంది. ఇంజిన్ ఆప్షన్లలో 1.0-లీటర్ ఎన్ఎ మరియు టర్బో-పెట్రోల్ మోటార్లు ఉండగా, ఇవి 5-స్పీడ్ ఎంటి, ఎఎంటి మరియు సివిటి ట్రాన్స్‌మిషన్లతో జతచేయబడ్డాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్